PRABANJANAM
Date of Publish : 17 August 2026, 7:03 pm Posted by : Prabanjanam News

మియాపూర్‌లో ఏడేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల శిక్ష

  • నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
  • బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం

శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు మహ్మద్ నజీర్ మియాకు న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామానికి చెందిన నిందితుడు మహ్మద్ నజీర్ మియా (57), నగరానికి వలసవచ్చి హఫీజ్ పేట్ మార్తాండ నగర్‌లో నివాసం ఉంటూ కిరాణా షాప్ నడుపుతున్నాడు. 2023 మార్చి 27న ఉదయం 9 గంటల సమయంలో ఏడేళ్ల బాలిక తన ఇంటి సమీపంలోని నిందితుడి కిరాణా దుకాణానికి పాల ప్యాకెట్ కొనుగోలు చేసేందుకు వెళ్లింది. పాలు ఇస్తానని చెప్పి నిందితుడు బాలికను దుకాణంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఏడుస్తుండగా దుకాణానికి ఓ కస్టమర్ రావడంతో నిందితుడు ఆమెను వదిలిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడే బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారించిన పోలీసులు 2023 మార్చి 31న అతడిని అరెస్టు చేశారు. దర్యాప్తు పూర్తిచేసిన అనంతరం కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణ పూర్తయిన అనంతరం రాజేంద్రనగర్‌లోని రంగారెడ్డి జిల్లా అత్యాచారం, పోక్సో కేసుల విచారణ ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 ఏబీ కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా, పోక్సో చట్టంలోని సెక్షన్ 5(ఎం) రెడ్‌విత్ 6 కింద మరో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. అలాగే బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో అప్పటి మియాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, దర్యాప్తు అధికారి ఎం. ప్రేమ్ కుమార్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర్ రెడ్డి విచారణ సమయంలో సమర్థవంతంగా వాదనలు వినిపించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసినట్లు పోలీసులు తెలిపారు.