PRABANJANAM
Date of Publish : 01 October 2026, 1:40 pm Posted by : Prabanjanam News

అద్దెల కోసం అడ్డగోలు నిర్మాణాలు.. 67 గజాల్లో నాలుగు అంతస్తులు!

  • 67 గజాలలో 4 అంతస్తులు నిర్మాణం
  • మరో సిద్దిక్ నగర్ లా మారుతున్న హౌసింగ్ బోర్డు
  • అద్దెల కోసం బహుళ అంతస్థుల నిర్మాణం
  • కళ్లుమూసుకున్న టీపీఎస్ సిబ్బంది

కూకట్ పల్లి ( ప్రభంజనం ): స్థలం తక్కువైనా  తగ్గేదేలేదు అంటున్నారు నిర్మాణదారులు. తక్కువ విస్తీర్ణంలో బహుళ అంతస్థుల నిర్మాణాలు సాగిస్తూ ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతూ.. తమకు మాత్రం అద్దెలు రావాలంటూ స్లాబ్ ల మీద స్లాబ్ లు వేస్తున్నారు. మాదాపూర్ పరిధిలోని సిద్దిక్ నగర్ లో ఇటీవల తక్కువ స్థలంలో నిర్మాణాలు చేపట్టగా అది కూలిపోయిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇటీవల గచ్చిబౌలి ఎన్టీఆర్ నగర్ లో ఓ నాలుగు అంతస్థుల భవనం పక్కకు ఒరిగింది. ఇన్ని ఘటనలు జరిగినా నిర్మాణదారుల అత్యాశ మాత్రం తగ్గడం లేదు.

తాజాగా కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని రోడ్డు నెంబర్ 2లో ఓ నిర్మాణదారుడు కేవలం తనకున్న 67 గజాల స్థలంలో నాలుగు ఫ్లోర్ ల నిర్మాణం చేపట్టాడు. ఓవైపు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నాం అంటూ రోజుకోచోట ఇల్లీగల్ నిర్మాణాలు కూలుస్తున్నా మంటూ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. కానీ ఆమె ఆశయాలకు, ఆలోచనలకు గండి కొడుతూ ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది మాత్రం అది నిజమే అన్నట్లుగా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో నిర్మాణదారులు తక్కువ స్థలంలో పేక మేడలు కడుతున్నారు. అవి ఏ క్షణంలో కూలుతాయో.. ఎవరి ప్రాణాలు బలితీసుకుంటాయో తెలియదు. ఘటన జరిగాక కాకుండా ముందే టీపీఎస్ సిబ్బంది మేలుకుంటే ప్రజల ప్రాణాలు కాపాడిన వారవుతారు. టీపీఎస్ సార్లు ఇదిగో ఇక్కడో ఓ లుక్కేయండి.. వీటికి ఎవరు బాధ్యులు.