ఇంటర్నేషనల్ డెస్క్ (ప్రభంజనం): మనిషి మేధస్సుకు మాత్రమే సాధ్యమని భావించిన గణిత శిఖరాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తాకింది. దశాబ్దాలుగా ప్రపంచ మేటి గణిత శాస్త్రవేత్తలకే సవాలుగా నిలిచిన ఓ అపరిష్కృత మిస్టరీని ఓపెన్ ఏఐ టెక్నాలజీ కేవలం 88 గంటల్లో ఛేదించినట్లు ప్రకటించింది. గణిత ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘మిలీనియం ప్రైజ్ ప్రాబ్లమ్స్’లో ఒకటైన 90 ఏళ్ల నాటి ‘నేవియర్-స్టోక్స్’ సమస్యను తమ అంతర్గత ఏఐ మోడల్ పరిష్కరించిందని వెల్లడించడంతో ఒక్కసారిగా ప్రపంచం విస్మయానికి గురైంది. అయితే, ఈ పరిష్కారాన్ని స్వతంత్ర గణిత నిపుణులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

గణితంలో ఏడు అత్యంత క్లిష్టమైన సవాళ్లను గుర్తించిన ‘క్లే మ్యాథమెటిక్స్ ఇన్‌స్టిట్యూట్’ 2000 సంవత్సరంలో మిలీనియం ప్రాబ్లమ్స్‌ను ప్రకటించి, ఒక్కో పరిష్కారానికి 1 మిలియన్ డాలర్ల నజరానాను నిర్ణయించింది. ఇప్పటివరకు అందులో కేవలం ఒకే ఒక్క సమస్య మాత్రమే పరిష్కారమైంది. తాజాగా ఓపెన్ ఏఐ పరిష్కరించామని చెబుతున్న ‘నేవియర్-స్టోక్స్’ సమీకరణాలు ప్రధానంగా ద్రవాల ప్రవాహాన్ని, వాతావరణ మార్పులను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. నిర్దిష్ట పరిస్థితుల్లో ఈ సమీకరణాలు పూర్తిగా విఫలమవుతాయా లేదా అనేదే ఈ సమస్య మూలం కాగా, ఒక సాఫీగా సాగే ద్రవ ప్రవాహంలో పరిమిత సమయంలో వేగం అనంతంగా పెరిగిపోయి ‘సింగులారిటీ’ ఏర్పడుతుందని ఓపెన్ ఏఐ(AI )పరిశోధన నిరూపించినట్లు పేర్కొంది.
ఈ భారీ విజయం వెనుక అపారమైన కంప్యూటింగ్ శక్తి దాగి ఉంది. ఓపెన్ ఏఐ ఏకంగా 10,000 ఏఐ ఏజెంట్లను ఏకకాలంలో రంగంలోకి దించింది. ఈ పరిశోధన ప్రక్రియలో ఏఐ ఏజెంట్లు 2.7 మిలియన్ సందేశాలను పరస్పరం పంపుకోగా, దాదాపు 130 బిలియన్ అవుట్‌పుట్ టోకెన్లను ఉపయోగించాయి. మొత్తం ప్రయోగాల్లో కలిపి 4.9 మిలియన్ మెసేజ్‌లు, 300 బిలియన్ టోకెన్లు ఖర్చయ్యాయి. ‘లీన్’ అనే ప్రోగ్రామింగ్ భాషలో రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ద్వారా ఈ గణిత పరిష్కారాన్ని రూపొందించారు. పరిశోధనా బృందాల మధ్య కీలక ఆలోచనలను అనుసంధానిస్తూ తాము తేనెటీగల్లా పనిచేశామని పరిశోధకుడు డాన్ రాబర్ట్స్ తెలపగా, ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ అని శాస్త్రవేత్త నోమ్ బ్రౌన్ వెల్లడించారు. ఈ పరిశోధన పత్రాన్ని ఓపెన్ ఏఐ మంగళవారం బయటపెట్టింది.

ఈ పరిణామంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్ మ్యాథ్ సొసైటీ దీనిని మానవ విజ్ఞానంలో ఒక గొప్ప మైలురాయిగా స్వాగతించింది. గతంలో నేవియర్, స్టోక్స్, లెరే, లాడిజెంస్కాయా మొదలుకొని ఇటీవలి కార్డోబా, మార్టినెజ్-జోరోవా, అల్పోజ్, బక్‌మాస్టర్ వంటి వారు చేసిన పరిశోధనల పరంపరలో ఓపెన్ ఏఐ ముగింపు పలికిందని ప్రశంసించింది. మరోవైపు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ టెరెన్స్ టావో భిన్నమైన ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడి సమస్యను సాధించే క్రమంలోనే మానవ మేధస్సు వికసిస్తుందని, “జిమ్‌కు వెళ్లి స్వయంగా బరువులు ఎత్తడానికి, యంత్రాలే ఆ బరువులను ఎత్తేయడానికి ఉన్నంత తేడా ఇక్కడా ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఏఐ ఒక నిర్దిష్ట దారి చూపితే మనుషులు కొత్త మార్గాలను అన్వేషించడం మానేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

శాస్త్ర సాంకేతిక రంగాల చరిత్రలో ఏఐ పాత్రను ఈ ఘట్టం సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఈ ప్రూఫ్‌ను విస్తృత గణిత సమాజం ధ్రువీకరిస్తే.. సైన్స్, లెక్కల భవిష్యత్తు పూర్తిగా యంత్రాల అపారమైన వేగం, సామర్థ్యాలపైనే ఆధారపడే నూతన శకం మొదలైనట్లే. ఏది ఏమైనా, మానవ ఆలోచనా విధానానికి యంత్రాల వేగం తోడైతే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో నిరూపించడానికి ఈ ప్రయోగం ఒక బలమైన సంకేతంగా నిలుస్తుంది.