- నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నా పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు
- కారు వెనుక అడ్వకేట్ సింబల్.. వాహనదారుల్లో చర్చ
హైదరాబాద్: నగరంలోని రద్దీ ప్రాంతమైన దిల్‌సుఖ్‌నగర్ రోడ్లపై ఓ కారు సంచలనం సృష్టిస్తోంది. నిబంధనలకు నీళ్లొదులుతూ, ఎలాంటి నెంబర్ ప్లేట్ లేకుండా ఓవర్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న ఈ వాహనం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కారు నెంబర్ ప్లేట్ ఉండాల్సిన చోట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోతో పాటు ‘తెలంగాణ టైగర్’ అనే పేరును ముద్రించి హల్చల్ చేస్తుండటం ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది.

అసలేం జరిగిందంటే..?
దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై వెళ్తున్న ఒక హోండా సిటీ కారుపై నిబంధనలకు విరుద్ధంగా రకరకాల ప్రదర్శనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా వాహనాలకు ఉండాల్సిన అధికారిక నెంబర్ ప్లేట్‌కు బదులుగా సీఎం రేవంత్ రెడ్డి ఫొటో, ‘తెలంగాణ టైగర్’ పేరును స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కారు వెనుక భాగంలో ‘అడ్వకేట్’ (Advocate) సింబల్‌ను కూడా ముద్రించారు. ఈ కారు ఎలాంటి నిబంధనలను లెక్కచేయకుండా ఓవర్ స్పీడ్‌తో రోడ్లపై తిరుగుతుండటం గమనార్హం.
పోలీసుల తీరుపై విమర్శలు..
సాధారణ వాహనదారులు చిన్నపాటి ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించినా, చలాన్లు పెండింగ్‌లో ఉన్నా వెంటనే సీజ్ చేసే ట్రాఫిక్ పోలీసులు.. నెంబర్ ప్లేట్ కూడా లేకుండా బహిరంగంగా రోడ్లపై తిరుగుతున్న ఈ కారును ఎలా అనుమతిస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ కారును అధికారికంగా పార్టీ పేరు మీద లేదా సీఎం కార్యాలయ అనుమతితోనే రిజిస్టర్ చేశారా? లేక ఎవరైనా అతివాదులు ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారా? అనే కోణంలో స్థానికులు చర్చించుకుంటున్నారు.
ట్రాఫిక్, రవాణా శాఖ (ట్రాన్స్‌పోర్ట్) అధికారులు ఇలాంటి వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలను ఉల్లంఘించి పోలీసులకూ సవాల్ విసురుతున్న ఈ కారు డ్రైవర్, యజమానిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.