PRABANJANAM
Date of Publish : 04 August 2026, 7:54 pm Posted by : Prabanjanam News

కల్యాణినగర్ ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలి

  • బాలానగర్ డివిజన్ సమీక్షలో కమిషనర్ సృజన
  • సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
  • నాలుగు నెలల తర్వాత మళ్లీ వస్తా: కమిషనర్

 

ప్రజల సమస్యలను వింటున్న కమిషనర్ సృజన

భారీ వర్షాలు కురిసిన ప్రతీసారీ కల్యాణినగర్ ప్రాంతం నీట మునుగుతోందని, దీనికి తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఈ-బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి అధికారులను కోరారు. బాలానగర్ డివిజన్‌లోని రాజుకాలనీ కమ్యూనిటీ హాల్‌లో మూసాపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజా సమస్యల సమీక్షా సమావేశానికి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ ఈ-బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి కమిషనర్‌కు స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ సృజన మాట్లాడుతూ.. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరికి వారు వివరిస్తే క్షణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నేతలు, స్థానిక ప్రజలు పాల్గొని తమ డివిజన్‌లోని సమస్యలను అధికారుల ముందుంచారు.

సమస్యల వెల్లువ..

ఈ సందర్భంగా పలువురు నాయకులు స్థానిక సమస్యలను కమిషనర్‌కు ఏకరువు పెట్టారు. మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలంలో కల్యాణినగర్ పూర్తిగా నీటిలో మునిగిపోయి ప్రజలు నానా తంటాలు పడుతున్నారని, ఈ ముంపు సమస్యకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే చెరబండరాజునగర్ కాలనీలో శ్మశాన వాటిక దుస్థితిని వివరించి, దాని అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డివిజన్‌లోని ఇతర సమస్యలపై వివిధ పార్టీల నేతలు, కాలనీవాసులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

నాలుగు నెలల తర్వాత మళ్లీ వస్తా: కమిషనర్ సృజన

ప్రజలు, నేతలు చెప్పిన ప్రతీ సమస్యను శ్రద్ధగా విన్న కమిషనర్ సృజన వాటిని నోట్ చేసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా వాటికి పరిష్కారం చూపడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన పరిధిలోని ప్రతి డివిజన్‌ను రోజూ పరిశీలించి, క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకోవడానికే ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు తెలిపిన సమస్యలు ఏ దశలో ఉన్నాయో సమీక్షించడానికి సరిగ్గా నాలుగు, ఐదు నెలల తర్వాత మళ్లీ ఈ ప్రాంతానికి వస్తానని ఆమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లిగారి లక్మయ్య, మేడ్చల్ ఫిషర్ మెన్ కమిటీ వైస్ చైర్మన్, బాలానగర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఆకుల నరేందర్ ముదిరాజ్, బాలానగర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్, కల్యాణినగర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ యూసఫ్, బాలానగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్, బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కవిత కాతురాయ, వివిధ కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.