- కర్రలతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కిన సీనియర్లు
- మెట్లపై పడి జారిపడ్డాడంటూ బుకాయించిన యాజమాన్యం
- దమ్మాయిగూడలో ఘటన.. విషమంగా బాధితుడి పరిస్థితి
- పోలీసులను ఆశ్రయించిన విద్యార్థి తల్లిదండ్రులు
మేడ్చల్ (ప్రభంజనం): ప్రఖ్యాత విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రతకు ఏపాటి రక్షణ ఉంటోందో చెప్పడానికి మరో దారుణ ఉదంతం మేడ్చల్ జిల్లాలో వెలుగు చూసింది. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో సీనియర్ విద్యార్థుల రాక్షస క్రీడ బట్టబయలైంది. తోటి విద్యార్థిపై ‘ర్యాగింగ్’ పేరుతో కొందరు సీనియర్లు మూకుమ్మడిగా దాడి చేసి, ప్రాణాపాయ స్థితికి చేర్చిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..
కామారెడ్డికి చెందిన అభిషేక్ దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్ హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు తాము సీనియర్‌లమనే అహంకారంతో కొంతకాలంగా అభిషేక్‌ను టార్గెట్ చేశారు. నిత్యం వేధింపులకు గురిచేస్తూ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో హాస్టల్ గదిలో ఉన్న అభిషేక్‌పై సుమారు 12 మంది విద్యార్థులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కర్రలతో, ప్లేట్లతో విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, బూట్లతో ముఖంపై తొక్కుతూ అత్యంత అమానుషంగా దాడి చేశారు. ఈ రాక్షస దాడిలో తీవ్రంగా గాయపడిన అభిషేక్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా మారడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిజం దాచిపెట్టేందుకు యాజమాన్యం యత్నం.
దారుణమైన దాడి జరిగి విద్యార్థి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే.. పాఠశాల యాజమాన్యం మాత్రం దాన్ని కప్పిపుచ్చేందుకు కుట్ర పన్నింది. అభిషేక్ మెట్ల మీద నుంచి జారిపడి గాయపడ్డాడంటూ తల్లిదండ్రులకు నిస్సిగ్గుగా తప్పుడు సమాచారం ఇచ్చారు. అయితే, ఆస్పత్రిలో తేరుకున్న బాధితుడు అభిషేక్ తనపై సీనియర్లు ర్యాగింగ్ పేరుతో దాడి చేసిన విషయాన్ని కన్నీరుమున్నీరుగా వివరిస్తూ తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు నిజాలు బయటపడ్డాయి.
పోలీసులకు ఫిర్యాదు.. కఠిన చర్యలకు డిమాండ్
తమ ముద్దుల కొడుకును ప్రాణాపాయ స్థితికి తెచ్చిన సీనియర్ విద్యార్థులపై, ఘటన బయటకు రాకుండా కప్పిపుచ్చి యాజమాన్య నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన పాఠశాల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కార్పొరేట్ విద్యా సంస్థల పేరు చెప్పి హాస్టళ్లలో పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.