హైదరాబాద్(ప్రభంజనం): ఫేక్ ఫైర్ ఎన్‌ఓసీలు సమర్పించి ఇంటర్మీడియట్ బోర్డు అనుమతులు పొందేందుకు ప్రయత్నించిన ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP ) ఆధ్వర్యంలో గురువారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు.ఈ సందర్భంగా ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కార్యదర్శి పృథ్వి తేజ మాట్లాడుతూ.. కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు ఇంటర్మీడియట్ బోర్డు అనుమతుల కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి దరఖాస్తులు సమర్పించడం తీవ్ర ఆందోళనకరమని ఆరోపించారు. ఈ ఘటనతో సంబంధిత కళాశాలలు మరెన్ని అక్రమాలకు పాల్పడుతున్నాయో అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని అనేక కళాశాలలు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, ఆటస్థలం వంటి కనీస సౌకర్యాలు లేకుండా, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. బోర్డు నుంచి అనుమతులు పొందకుండానే అడ్మిషన్లు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఫోర్జరీకి పాల్పడిన కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమాలను వెలికితీయాలని కోరింది.ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే అక్రమాలకు పాల్పడిన కళాశాలలపై ఏబీవీపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ విభాగ్ కన్వీనర్ హరి ప్రసాద్, కోటి జిల్లా కన్వీనర్ రేవంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజన్, నగర కార్యదర్శి సురేందర్, రిషింద్ర, మణిదీప్, రాహుల్, సచిన్, సాయికిరణ్, విష్ణు, శివ, జశ్వంత్, రఘునందన్, రాంప్రసాద్, శివ ప్రసాద్, పి. శివ, కురుమూర్తి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.