- లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ, ఎస్సై అరెస్ట్
- కొత్తగా వచ్చినా.. ఎస్సై అప్పుడే లంఛావతారం ఎత్తాడు
కీసర: ( ప్రభంజనం )
రోజుకోచోట లంచగొండి అధికారులు పట్టుబడుతున్నా అధికారుల తీరుమారడం లేదు. స్టేషన్ బెయిల్ కోసం వచ్చిన బాధితుడి వద్ద లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు ఇద్దరు పోలీసు అధికారులు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలపై కీసర సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అధికారుల కథనం ప్రకారం.. పీడీఎస్ బియ్యం కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు కీసర సీఐ ఆర్ కే అంజనేయులు, ఎస్సై జ్ఞ్యానేందర్ రెడ్డిలు రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా బాధితుడి నుండి రూ.5 లక్షలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కీసర పెద్దమ్మ చెరువు సమీపంలో కారులో రూ.5 లక్షలు తీసుకుంటున్న సమయంలో ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి, సీఐ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు చిక్కినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో ఎస్‌ఐ అక్కడి నుంచి పరుగులు తీసేందుకు ప్రయత్నించారు. అయితే అధికారులు వెంబడించి అతన్ని పట్టుకున్నారు. అనంతరం అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. లంచం డిమాండ్ చేయడం, నిందితులతో పనులు చేయించుకోవడం తదితర ఆరోపణలపై కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా, కెమికల్ పరీక్షల విషయంలోనూ అధికారులు, నిందితుల మధ్య కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది.
ఇటీవలనే వచ్చిన ఎస్సై జ్ఞానేందర్..
ఇటీవల జరిగిన బదిలీల భాగంగా ఎస్సై జ్ఞానేందర్ కీసర ఎస్సైగా బదిలీపై వచ్చారు. ఇంకా ఆయనకు తన సెక్టార్ పరిధిలో పెద్దగా పరిచయాలు కూడా కాలేవని, కానీ అప్పుడే ముడుపుల కోసం చేతులు చాచడం చర్చనీయాంశంగా మారింది. ఆయనతో పాటు సీఐ ఆంజనేయులు కూడా లంచం కేసులో ఇరుక్కోవడంపట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.