PRABANJANAM
Date of Publish : 07 September 2026, 9:21 am Posted by : Prabanjanam News

Telangana Assembly: కాంగ్రెస్ హామీల అమలుపై అసెంబ్లీలో నిలదీస్తాం :బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

  • అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపడానికి రేవంత్ ప్రభుత్వం భయపడుతోంది

తెలంగాణ బ్యూరో ( ప్రభంజనం ): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భయపడుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి బీజేపీ శాసనసభాపక్షం కార్యాచరణ రూపొందించిందని తెలిపారు.
అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై ఆదివారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేయనున్నట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై సభలో నిలదీస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఇంకా ఎందుకు అమలు చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.
ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలతో పాటు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావిస్తామని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వంలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అవినీతి, అక్రమాలపై కూడా సభలో ప్రశ్నలు సంధిస్తామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ శాసనసభాపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్న తీరును ఎండగడతామని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వ వైఫల్యాలను సభలో ప్రశ్నిస్తామని తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై కూడా నిలదీస్తామని పాయల్ శంకర్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించిన నేపథ్యంలో, రానున్న సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది.