PRABANJANAM
Date of Publish : 15 August 2026, 1:13 pm Posted by : Prabanjanam News

మియాపూర్‌లో సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం

  • పాల్గొన్న సీఐ జయరాం, డీఐ విజయ్ నాయక్

శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )

మియాపూర్‌లోని డీ మార్ట్‌లో మియాపూర్‌ పోలీసులు సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. “సురక్షా కా తిరంగా” అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీ మార్ట్‌కు చెందిన సుమారు 80 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మియాపూర్‌ సీఐ జయరాం, డీఐ విజయ్‌ లు ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలు, యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ మోసాలు, ఫిషింగ్‌ లింకులు, ఏపీకే, కేవైసీ మోసాలు, ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్‌ మోసాలు, డిజిటల్‌ అరెస్ట్‌, ఫేక్‌ కస్టమర్‌ కేర్‌, ఉద్యోగాలు, లోన్ల పేరుతో జరిగే మోసాలపై పోలీసులు అవగాహన కల్పించారు. అలాగే సైబర్‌ బుల్లీయింగ్‌, సైబర్‌ స్టాకింగ్‌, సెక్స్టార్షన్‌, సోషల్‌ మీడియా, వాట్సాప్‌ మోసాలు, ఐడెంటిటీ థెఫ్ట్‌, ఇంపర్సనేషన్‌ వంటి సైబర్‌ నేరాలపై వివరించారు. తెలియని వ్యక్తులతో ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్‌ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని పోలీసులు సూచించారు. అనుమానాస్పద లింకులు, యాప్‌లు, మెసేజ్‌లను క్లిక్‌ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
సైబర్‌ ఆర్థిక మోసానికి గురైన వెంటనే 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.