- రాయదుర్గంలో ఆల్‌టైమ్ రికార్డు ధర
- గత రికార్డులు బ్రేక్
హైదరాబాద్ బ్యూరో: ( ప్రభంజనం )
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో భూమి ధర కొత్త రికార్డు సృష్టించింది. రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడైంది. దీంతో హైదరాబాద్‌లో ఎకరా భూమి ధరకు సంబంధించి ఆల్‌టైమ్ రికార్డు నమోదైంది. రాయదుర్గం పాన్‌మక్తాలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 5.25 ఎకరాల ప్లాట్ (పి1)కు శుక్రవారం ఈ-వేలం నిర్వహించారు. ఎకరాకు రూ.175 కోట్ల కనీస ధరగా నిర్ణయించగా.. చివరకు రూ.264 కోట్లకు బిడ్ దక్కింది. అంటే కనీస ధర కంటే 50.9 శాతం అధికంగా ధర పలికింది. ఈ ప్లాట్ విక్రయం ద్వారా టీజీఐఐసీకి మొత్తం రూ.1,386 కోట్ల ఆదాయం సమకూరింది.
ఇదే ప్రాంతంలో గత మే నెలలో జరిగిన వేలంలో ఎకరాకు రూ.237 కోట్ల ధర పలికింది. తాజాగా ఆ రికార్డు కూడా బద్దలైంది. 2025లో రాయదుర్గంలో ఎకరా ధర సుమారు రూ.177 కోట్లుగా ఉండగా, ఏడాది వ్యవధిలోనే అది భారీగా పెరగడం రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాయదుర్గం హైదరాబాద్ ఐటీ, నాలెడ్జ్ సిటీ గ్రోత్ కారిడార్‌లో ఉండటమే ఈ భారీ ధరకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఐటీసీ కోహినూర్ హోటల్‌కు ఎదురుగా ఉన్న ఈ ప్రాంతం దుర్గం చెరువు, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు సమీపంలో ఉంది. మల్టీ-యూజ్ జోన్‌గా ఉన్న ఈ భూమికోసం పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీ పడ్డాయి.
వేలంలో పాల్గొనే బిడ్డర్లు రూ.10 కోట్ల డిపాజిట్ చెల్లించారు. అయితే ఈ భూముల వేలంపై గతంలో తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ప్రాంతంలో చారిత్రక రాతి కట్టడాలు ఉన్నాయని, దుర్గం చెరువుకు సమీపంలో ఉందని, యాజమాన్య హక్కులపై వివాదాలు ఉన్నాయని పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే వేలం ప్రక్రియను నిలిపివేయడానికి న్యాయస్థానాలు నిరాకరించాయి. ఈ ప్లాట్లు రక్షిత వారసత్వ ప్రాంతాలు లేదా బఫర్ జోన్ పరిధిలోకి రావని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా వేలంలో భారీ ధర రావడంతో రాయదుర్గం భూములపై డిమాండ్ మరింత స్పష్టమైంది. ఇదే సర్వే నంబర్‌లోని మరో 5.38 ఎకరాల ప్లాట్‌కు ఆగస్టు 28న వేలం నిర్వహించనున్నట్లు టీజీఐఐసీ ప్రకటించింది. దీంతో తదుపరి వేలంలో భూమి ధర మరింత పెరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది.