- రోగి మృతి ఘటనపై మెడికవర్ డాక్టర్ల విచారం..
- వాస్తవాలను వెల్లడించిన యాజమాన్యం
- తప్పుడు ప్రచారంపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి విజ్ఞప్తి
సికింద్రాబాద్,(ప్రభంజనం):
సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో యువ రోగి మృతి ఘటనకు సంబంధించి గత రెండు వారాలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది.
ఈ ఘటనకు సంబంధించిన వైద్యపరమైన వివరాలను మీడియా ముందు వెల్లడిస్తూ.. వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ను కోరనున్నట్లు వెల్లడించింది. ఈ మీడియా సమావేశంలో మెడికవర్ హాస్పిటల్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణతో పాటు, డాక్టర్ ఏ. శరత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. హరికృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచులకంటి, చీఫ్ ఆఫ్ కార్డియాలజీ, డైరెక్టర్ స్ట్రక్చరల్ హార్ట్ అండ్ అడ్వాన్స్డ్ కరోనరీ ఇంటర్వెన్షన్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. మృతి చెందిన యువ రోగి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యుల బాధను తాము అర్థం చేసుకుంటున్నామని పేర్కొంటూ, ఈ ఘటనకు సంబంధించి కొన్ని వేదికల్లో వాస్తవాలకు విరుద్ధమైన సమాచారం ప్రచారం అవుతోందని తెలిపారు.
ప్రజలకు సరైన వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
రోగి బయటి డయాగ్నస్టిక్ సెంటర్లో చేయించుకున్న సీటీ స్కాన్‌తో ఆసుపత్రికి వచ్చారని, ఆ నివేదికలో సుమారు 16 × 17 × 20 మిల్లీమీటర్ల పరిమాణంలో కిడ్నీ రాయి ఉన్నట్లు, అది మూత్ర ప్రవాహానికి అడ్డంకిగా మారడంతో మూత్రపిండంలో వాపు ఏర్పడినట్లు వెల్లడైందని ఆసుపత్రి యాజమాన్యం వివరించింది.
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్లుగా రాయి పరిమాణం 1–2 మిల్లీమీటర్లు కాదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన డయాగ్నస్టిక్ నివేదికను మీడియాకు అందజేయనున్నట్లు తెలిపింది.
రోగికి స్టెంట్ వేయడం సాధ్యం కాకపోవడంతో సాధారణ అనస్థీషియా కింద పీసీఎన్ఎల్ విధానంలో కిడ్నీ రాయిని తొలగించినట్లు యాజమాన్యం వెల్లడించింది.
శస్త్రచికిత్స అనంతరం రోగిని శ్వాసనాళంలో అమర్చిన ట్యూబ్ నుంచి తొలగించగా, ఆమె స్పృహలో ఉండి సాధారణ స్థితిలో కనిపించారని, అనంతరం సర్జికల్ ఐసీయూకు తరలించారని వివరించింది.
శస్త్రచికిత్సకు ముందు నిర్వహించిన రక్త పరీక్షల్లో వైట్ బ్లడ్ సెల్ కౌంట్ సుమారు 7,000గా, ప్లేట్లెట్ల సంఖ్య సుమారు రెండు లక్షలుగా ఉన్నాయని, హీమోగ్లోబిన్‌తో సహా ఇతర రక్తపరీక్షల ఫలితాలు సాధారణ స్థాయిలో ఉన్నాయని ఆసుపత్రి తెలిపింది. ఆ సమయంలో ఇన్ఫెక్షన్కు సంబంధించిన స్పష్టమైన సూచనలు కనిపించలేదని పేర్కొంది. అయితే, శస్త్రచికిత్స సమయంలో కిడ్నీ రాయికి ఇన్ఫెక్షన్ ఉండవచ్చని సర్జన్ అనుమానించడంతో యాంటీబయాటిక్స్ ప్రారంభించినట్లు వివరించింది.
అయితే, మరుసటి ఉదయం రోగికి అధిక జ్వరం, మూత్ర విసర్జన తగ్గడం, రక్తపోటు పడిపోవడం, కామెర్లు వంటి లక్షణాలు కనిపించాయని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. సుమారు ఎనిమిది యూనిట్ల ప్లేట్లెట్లు ఎక్కించినప్పటికీ వాటి సంఖ్య మెరుగుపడలేదని పేర్కొంది. పరిస్థితి విషమించడంతో రోగిని మెడికల్ ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి, అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందించినట్లు వివరించింది.
తీవ్రమైన సెప్సిస్, ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం కారణంగా మెదడులో సబ్అరాక్నాయిడ్ హేమరేజ్ అనే తీవ్రమైన రక్తస్రావం సంభవించిందని, వైద్య బృందం అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రోగిని కాపాడలేకపోయామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.
ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ, రోగికి అవసరమైన వైద్య చికిత్సను తగిన సమయంలో అందించామని, నిర్దేశిత వైద్య విధానాలను అనుసరించామని పేర్కొన్నారు. కిడ్నీ రాయి కంటే, తీవ్రమైన ఇన్ఫెక్షన్ మరియు దానికి శరీరం స్పందించిన తీరు ఈ విషాదకర పరిణామానికి కారణమయ్యాయని తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు వాస్తవాలకు విరుద్ధమైన సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు, నిరసనలను ప్రోత్సహిస్తూ ఆసుపత్రి ప్రతిష్ఠను, రోగుల్లో ఆసుపత్రిపై ఉన్న నమ్మకాన్ని, వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని మెడికవర్ యాజమాన్యం ఆరోపించింది.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ డీజీపీని కలిసి వినతిపత్రం అందించనున్నట్లు వెల్లడించింది. అయితే, అన్ని యూట్యూబ్ ఛానళ్లపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, వాటిలో అనేక ఛానళ్లు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాయని డాక్టర్ అనిల్ కృష్ణ అన్నారు.