PRABANJANAM
Date of Publish : 15 August 2026, 12:50 pm Posted by : Prabanjanam News

విడియా, ఎఫ్‌సీఐ కాలనీల్లో అధ్వానంగా రోడ్లు

  • వర్షం పడితే బురదమయంగా మారుతున్న రహదారులు
  • అంబులెన్స్, స్కూల్ విద్యార్థులకు ఇబ్బందులు

శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )

మియాపూర్‌లోని విడియా, ఎఫ్‌సీఐ కాలనీల్లో రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చిన్నపాటి వర్షం పడినా రహదారులన్నీ బురదమయంగా మారడంతో కాలనీవాసులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొనడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలనీలో అంబులెన్స్ బురదలో ఇరుక్కుపోయిన ఘటన చోటుచేసుకోవడంతో పరిస్థితి తీవ్రత స్పష్టమైంది. అలాగే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బురదలో జారిపడిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయని కాలనీవాసులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు వెళ్లేందుకు కూడా రోడ్లు అనుకూలంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా కాలనీ ప్రధాన రహదారిలో ఇటీవల డ్రైనేజీ పైప్‌లైన్ పనులు చేపట్టారు. పనులు పూర్తయిన అనంతరం రోడ్లు వేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు రహదారి నిర్మాణ పనులు చేపట్టలేదని కాలనీవాసులు పేర్కొన్నారు. ఈ సమస్యపై కాలనీవాసులు మియాపూర్ డిప్యూటీ కమిషనర్‌తో పాటు జోనల్ కమిషనర్లకు వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం ఇంజినీరింగ్ విభాగం అధికారులు కాలనీని సందర్శించి రోడ్ల దుస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత అధ్వానంగా మారే అవకాశం ఉన్నందున అధికారులు ఇకనైనా స్పందించి విడియా, ఎఫ్‌సీఐ కాలనీల్లోని రోడ్లను తక్షణమే నిర్మించి, ప్రజలకు సురక్షితమైన రాకపోకల సౌకర్యం కల్పించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.