- విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న కాంగ్రెస్ నాయకులు
ఘట్కేసర్: (ప్రభంజనం)
ఘట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్, పోచారంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నూతన పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం మల్లిఖార్జున్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని, పాఠశాల ప్రాంగణంలో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి నూతన భవన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బద్దం మల్లిఖార్జున్ రెడ్డి మాట్లాడుతూ… ముందుగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ… గ్రామాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ప్రాథమిక పాఠశాలను హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేయడం వల్ల స్థానిక విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు ఉన్నత చదువుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సొంత గ్రామంలోనే చదువుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులను పూర్తి చేసి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్, ఎం. మల్లారెడ్డితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పంచాయతీ ప్రతినిధులు పాల్గొన్నారు.