PRABANJANAM
Date of Publish : 04 August 2026, 3:42 pm Posted by : Prabanjanam News

కూకట్‌పల్లిలో బీజేపీ వినూత్న నిరసన

ఫీజు బకాయిలపై వడ్డేపల్లి రాజేశ్వరరావు లడాయి.

కూకట్‌పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని భరత్ నగర్ కూరగాయల మార్కెట్‌లో వినూత్న నిరసన చేపట్టారు. “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజేశ్వరరావు మార్కెట్‌లో కూరగాయలు విక్రయించడం, కూరగాయల బస్తాలు మోయడం, రోడ్లు ఊడవడం వంటి పనులు చేస్తూ ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వ్యాపారులు, కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.రాజేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రభుత్వానికి నిధులు లేకుంటే మేమే మార్కెట్‌లో కూరగాయలు అమ్మి, బస్తాలు మోసి, రోడ్లు ఊడ్చి వచ్చిన డబ్బును ప్రభుత్వానికి అందిస్తాం.. కానీ పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దు” అని ఆయన ఘాటుగా విమర్శించారు. వెంటనే బకాయిలు విడుదల చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.