PRABANJANAM
Date of Publish : 27 August 2026, 6:48 pm Posted by : Prabanjanam News

Buildings Demolished: CMC పరిధిలో 21 భవనాల కూల్చివేత, 14 మందికి నోటీసులు

శేరిలింగంపల్లి: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా గురువారం మూడు జోన్లలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టిన అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న 54 అనధికార నిర్మాణాలను గుర్తించారు. ఇందులో భాగంగా 21 భవనాలను కూల్చివేయగా, మరో 14 నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. ఒక అక్రమ కట్టడాన్ని అధికారులు పూర్తిగా సీజ్ చేశారు. జోన్ల వారీగా శేరిలింగంపల్లిలో అత్యధికంగా 9, కూకట్‌పల్లిలో 6, కుత్బుల్లాపూర్‌ జోన్‌లో 6 చొప్పున అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. మిగిలిన 33 కేసులపై నిబంధనల ప్రకారం తదుపరి కూల్చివేత లేదా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘిస్తే ఊపేక్షించేది లేదని, ప్రతిరోజూ క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి కఠిన పర్యవేక్షణ కొనసాగించాలని టౌన్ ప్లానింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను సీఎంసీ కమిషనర్ ఆదేశించారు.