పంజాగుట్ట శ్మశానవాటికలో కలకలం..
ఖననం చేసిన చోట ఖాళీ గోతి..
విచారణ చేపట్టిన పోలీసులు
సిటీ క్రైమ్: ( ప్రభంజనం )
పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో పూడ్చిన ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఖననం చేసిన కొద్దిరోజులకే మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఖననం చేసిన ప్రదేశంలో గోతిని తవ్వి ఉండటాన్ని గుర్తించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కవలల్లో ఒకరు మృతి
చార్మినార్ ఘాన్సీబజార్‌కు చెందిన దంపతులకు ఆరు నెలల క్రితం కవలలు జన్మించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులను బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో గత శనివారం ఒక పసికందు చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో ఖననం చేశారు.
రెండో చిన్నారి మృతితో శ్మశానవాటికకు..
కాగా, మరో పసికందు కూడా ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో సోమవారం రెండో చిన్నారి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు పంజాగుట్ట శ్మశానవాటికకు వచ్చారు. ఈ సమయంలో మొదటి చిన్నారిని ఖననం చేసిన ప్రదేశంలో గోతిని తవ్వి ఉండటాన్ని వారు గమనించారు. గోతిలో మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మృతదేహం ఏమైందనే విషయం తెలియక వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
కాటికాపరుల తీరుపై ఆరా..
రెండో పసికందు అంత్యక్రియలు పూర్తయిన అనంతరం కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్మశానవాటికలో పనిచేసే కాటికాపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
మృతదేహం ఎలా అదృశ్యమైంది? గోతిని ఎవరు తవ్వారు? మృతదేహాన్ని ఎవరైనా తీసుకెళ్లారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్మశానవాటిక పరిసరాల్లోని పరిస్థితులు, అక్కడ పనిచేసే సిబ్బంది కదలికలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.