- వృద్ధురాలి మెడలో నుండి బంగారు గొలుసు అపహరణ
కీసర: ( ప్రభంజనం )
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం అన్నపూర్ణ కాలనీలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. శకుంతల (68) అనే వృద్ధురాలి మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలు తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు అవసరమైన వస్తువులను సర్దుకుంటున్న సమయంలో, వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారైనట్లు సమాచారం. ఈ ఘటనతో బాధితురాలు ఆందోళనకు గురైంది. సమాచారం అందుకున్న కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించేందుకు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
కాలనీల్లో సీసీటీవీ కెమెరాలు లేని ప్రాంతాల్లో దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు కాలనీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, పోలీసులు గస్తీని ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.