PRABANJANAM
Date of Publish : 17 August 2026, 12:49 pm Posted by : Prabanjanam News

ఢిల్లీ మెట్రోలో మహిళ ఫొటో తీసిన సీఐఎస్ ఎఫ్ జవాన్?

  • సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
  • కొనసాగుతున్న శాఖాపరమైన విచారణ

న్యూఢిల్లీ: ( ప్రభంజనం )

ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ మహిళను తన మొబైల్ ఫోన్‌తో ఫొటో తీశాడన్న ఆరోపణలపై సీఐఎస్ ఎఫ్ జవాన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. తనను సీఐఎస్ ఎఫ్ జవాన్ ఫొటో తీశాడని అనుమానించిన మహిళ.. ఫోన్ చూపించాలని కోరడంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఫొటోను డిలీట్ చేయాలని మహిళ కోరడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు, జవాన్ మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో జవాన్ తన సర్వీస్ పిస్టల్‌ను ప్రయాణికుల వైపు చూపించాడన్న ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే ఈ ఆరోపణలను మెట్రో పోలీసులు ఖండించారు. ఘటనపై సీఐఎస్ ఎఫ్ అధికారులు చర్యలు తీసుకుని సంబంధిత జవాన్‌ను సస్పెండ్ చేశారు. ఫొటో తీసిన ఘటనతో పాటు ఆయుధాన్ని చూపించారన్న ఆరోపణలపై కూడా శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. విచారణలో ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.