PRABANJANAM
Date of Publish : 04 August 2026, 4:06 pm Posted by : Prabanjanam News

మాజీ మంత్రి హరీష్‌రావుపై ఉస్మానియా పీఎస్‌లో ఫిర్యాదు

హైదరాబాద్ : మాజీ  మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు (Harish Rao)పై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ (OU) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో కలిసి వెళ్లిన ఆయన, తెలంగాణ ప్రజలకు హాని కలిగేలా హరీష్‌రావు క్షుద్ర పూజలు చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం చనగాని దయాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకుండా, ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బందులు పడాలనే దురుద్దేశంతో హరీష్‌రావు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు వెళ్లి క్షుద్ర పూజలు నిర్వహించారని ఆరోపించారు. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడటం సమాజానికి తగదని హితవు పలికారు. ఈ ఉదంతంపై తెలంగాణ ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని.. రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తున్న తరుణంలో ఇలాంటి చర్యల ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పోలీసులు ఈ అంశంపై తక్షణమే విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరారు.