- ముఠాలో నలుగురు అరెస్ట్..
- నకిలీ బంగారు నాణేలు, వాహనాలు స్వాధీనం.

క్రైమ్ బ్యూరో : ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. రాజేంద్రనగర్ పోలీసుల సహకారంతో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కార్లు, ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు, 25 నకిలీ బంగారు పూత నాణేలు, ఆరు కిలోల బొగ్గు, నాలుగు కిలోల మట్టి, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
బొగ్గు.. నకిలీ నాణేలతో మాయ:
ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36) తనకు గుప్త నిధులు వెలికితీసే ప్రత్యేక విద్య ఉందంటూ ప్రచారం చేసుకునేవాడు. సయ్యద్ అలీ అష్రఫ్ (40), మహ్మద్ హాజీ (25), మహ్మద్ సల్మాన్ (29)తో కలిసి ప్రజలను నమ్మించేవాడు. ముందుగా సూచించిన ప్రదేశంలో గుంత తీయించి.. అందులో బొగ్గు, నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని రహస్యంగా పెట్టేవారు. అనంతరం పూజలు చేసి బొగ్గు బంగారంగా మారేందుకు సమయం పడుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయేవారు.
11 మందిని మోసం చేసినట్లు ఆధారాలు
వివిధ ప్రాంతాల్లో సుమారు 11 మందిని మోసం చేసి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మునావర్‌పై గతంలో బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో మోసం కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిధుల పేరుతో ఎవరైనా నమ్మించే ప్రయత్నం చేస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.