- కొంపల్లిలో పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డైన వైనం
- బాధ్యతాయుత పదవిలో ఉంటూ రెండోసారి దొరికిన వైనం
మేడ్చల్ (ప్రభంజనం): బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి పేకాట ఆడుతూ మరోసారి పోలీసులకు చిక్కారు. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లిలో బుధవారం రాత్రి పేకాట ఆడుతున్న సమాచారంతో పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఆయన పట్టుబడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొంపల్లిలోని ఓ నివాసంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతంపై దాడి చేశారు. ఈ రైడ్స్‌లో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డితో పాటు మరికొందరు జూదరులు అదుపులోకి వచ్చారు. వారి నుంచి భారీగా నగదుతో పాటు పేకాట ముక్కలను (ప్లే కార్డ్స్) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.కాగా, దేవేందర్‌రెడ్డి పేకాట ఆడుతూ పట్టుబడడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలోనూ ఓ సారి జూదూలాట కేసులో ఆయన పోలీసులకు చిక్కారు. ప్రజా ప్రతినిధిగా, జిల్లా సహకార రంగానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ వరుసగా దొరుకుతుండడం స్థానికంగా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.