PRABANJANAM
Date of Publish : 07 September 2026, 9:26 am Posted by : Prabanjanam News

హైవేలపై లారీలు, టిప్పర్ల నుంచి డీజిల్ దొంగతనాలు.. ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్

  • ఇన్నోవా, 20 డీజిల్ క్యాన్లు, పైపు, నంబర్ ప్లేట్లు స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు

కామారెడ్డి (ప్రభంజనం) :

సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేలు, రహదారుల పక్కన పార్క్ చేసి ఉంచిన లారీలు, టిప్పర్ వాహనాల నుంచి డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను సదాశివనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు అహ్మద్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, గుర్తుతెలియని వ్యక్తులు షెడ్ తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి అశోక్ లేల్యాండ్ టిప్పర్ వాహనం ( టీఎస్ 12Uఈ1882) డీజిల్ ట్యాంక్ నుంచి సుమారు 120 లీటర్ల డీజిల్‌ను దొంగిలించినట్లు సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వీరయ్య, సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానం, స్థానిక సమాచారాన్ని ఉపయోగించి పోలీసులు నిందితుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శనివారం రాత్రి సుమారు 11:30 గంటలకు నిందితులు మరోసారి డీజిల్ దొంగతనానికి ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని పోలీసులు గుర్తించగా, పోలీసులను గమనించిన నిందితులు వాహనంతో పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంటాడి ఆదివారం ఉదయం తిరుమనపల్లి రోడ్డుపై ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, హైవేలపై పార్క్ చేసిన లారీలు, టిప్పర్ల నుంచి డీజిల్ దొంగతనాలకు పాల్పడటంతో పాటు గతంలో పలు ప్రాంతాల్లో జరిగిన డీజిల్ దొంగతనాల్లో కూడా తమ ప్రమేయం ఉన్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

ముగ్గురు పాత నేరస్థుల ముఠా..

మియాపూర్ కు చెందిన వర్త్య రవి నాయక్ (32), లంబాడి శంకర్(23), శ్రీనివాస్ చవాన్ ముగ్గురు నిందితులు ఒక ముఠాగా ఏర్పడి అక్రమంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో డీజిల్ దొంగతనాలకు పాల్పడేవారు. హైవేలు, రహదారుల పక్కన పార్క్ చేసి ఉన్న లారీలు, టిప్పర్ వాహనాలను లక్ష్యంగా చేసుకునేవారు. ముఖ్యంగా తమ ప్రాంతానికి చెందిన వాహనాలను కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన లారీలు, దూర ప్రాంతాల్లో పార్క్ చేసిన వాహనాలను గుర్తించి రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడేవారు.
వాహనాల ఫ్యూయల్ ట్యాంకుల తాళాలను పగులగొట్టి, పైపు సహాయంతో డీజిల్‌ను బయటకు తీసి 35 లీటర్ల క్యాన్లలో నింపుకుని తరలించేవారు. దొంగిలించిన డీజిల్‌ను హైదరాబాద్‌కు చెందిన మునీర్ అనే వ్యక్తికి ఒక్కో క్యాన్‌కు సుమారు రూ.2,500/- చొప్పున విక్రయించేవారు. డీజిల్ క్యాన్లను సులభంగా తరలించేందుకు ఇన్నోవా వాహనం వెనుక సీట్లను తొలగించి, క్యాన్లు, ఇతర సామగ్రిని తరలించేందుకు అనుకూలంగా వాహనాన్ని ప్రత్యేకంగా మార్పులు చేసుకున్నారు. దర్యాప్తులో నిందితులు గతంలో నాగర్‌కర్నూల్, కేశంపేట, నారాయణపేట, కలికొండ, కోస్గి పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా డీజిల్ దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది. డీజిల్ దొంగతనాల ముఠాను గుర్తించి అరెస్ట్ చేయడంలో సమన్వయంతో, సమర్థవంతంగా పనిచేసిన సదాశివ నగర్ ఎస్సై పుష్పరాజు, కానిస్టేబుల్ అజార్, శంకర్, సిపిఎస్ కానిస్టేబుల్ జొన్నల రవి శ్రీనివాస్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.