PRABANJANAM
Date of Publish : 15 August 2026, 4:54 pm Posted by : Prabanjanam News

మౌలాలిలో డ్రగ్స్ తయారీ గుట్టు రట్టు..నిందితుడి అరెస్ట్, డ్రగ్స్ స్వాధీనం

హైదరాబాద్ :  మౌలాలి పారిశ్రామిక ప్రాంతంలోని ఎస్‌ఎం ల్యాబ్స్ యూనిట్-2లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్న నెట్‌వర్క్‌ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఛేదించారు.
పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్న ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఎస్‌ఎం ల్యాబ్స్ యూనిట్-2 యజమాని మాణిక్య రెడ్డితో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. ల్యాబ్‌లో తయారు చేసిన సుమారు 60 కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.17 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత కొంతకాలంగా ల్యాబ్‌లో అల్పజోలం, మెఫీడ్రిన్ వంటి మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో గుర్తించింది. కెమికల్ సైంటిస్టుల సహకారంతో ల్యాబ్‌లోనే డ్రగ్స్ తయారు చేసి, వాటిని నార్త్ ఇండియాకు తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. డ్రగ్స్ తయారీకి సంబంధించి కీలక ఆధారాలను అధికారులు సేకరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? డ్రగ్స్‌ను ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణాల్లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మౌలాలి ఎస్‌ఎం ల్యాబ్స్‌లో డ్రగ్స్ తయారీ కలకలం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.