PRABANJANAM
Date of Publish : 27 August 2026, 7:44 pm Posted by : Prabanjanam News

E20 Fuel: పాత వాహనదారులకు ఊరట.. ఈ20తో పాటు ఈ10 పెట్రోల్‌నూ తెస్తున్న బీపీసీఎల్

ముంబయి: దేశంలో ఇంధన విప్లవానికి నాంది పలుకుతూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ20 పెట్రోల్‌తో పాటు ఈ10 పెట్రోల్‌ను కూడా మార్కెట్లో అందుబాటులోకి ఉంచనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. పాత తరం వాహనదారులకు ఇంధన ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన ఈ20 ఇంధన సరఫరా వేగంగా పుంజుకుంటోంది. అయితే, పాత వాహనాలు ఈ20 ఇంధనానికి అనుకూలంగా ఉండవనే ఆందోళనల నేపథ్యంలో, బీపీసీఎల్ ఈ వ్యూహాత్మక నిర్ణయాన్ని వెల్లడించింది. పాత ఇంజన్లు దెబ్బతినకుండా ఉండేందుకు వీలుగా 10 శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన ఈ10 ఇంధనాన్ని పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. దీనివల్ల నూతన టెక్నాలజీ వాహనదారులతో పాటు పాత వాహనాలు కలిగిన కోట్లాది మంది వినియోగదారులకు ఎటువంటి సాంకేతిక సమస్యలు రావని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు.