- లేనిది ఉన్నట్లు.. కానిది అయినట్లు..!
- నమ్మించి నట్టేట్ల ముంచిన వైనం..
- భూమి విక్రయ మోసం పై
ఆరోపణలు.. - 3 గుంటల భూమి ఉండగా 600 చదరపు గజాలుగా చూపించి విక్రయం
- నమ్మించి విక్రయంచిన దంపతులపై పోలీసులకు ఫిర్యాదు
- నిజాంపేట్ వాసి కొలన్ రాజమోహన్ రెడ్డిపై కేసు నమోదు
మేడ్చల్ ప్రతినిధి;(ప్రభంజనం):
నిజాంపేట్ గ్రామంలోని సర్వే నంబర్ 15లో భూమి విక్రయానికి సంబంధించి మోసం జరిగిందంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. తనకు చెందినదిగా పేర్కొన్న స్థలాన్ని విక్రయిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని, అనంతరం భౌతిక స్వాధీనం అప్పగించకుండా మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు ప్రకారం.. కొలన్ హరిత, తన భర్త కొలన్ రాజమోహన్ రెడ్డితో కలిసి సర్వే నంబర్ 15లోని స్థలానికి తామే యజమానులమని, మున్సిపల్ అనుమతులు కూడా ఉన్నాయని చెప్పినట్లు పేర్కొన్నారు. వారి మాటలను నమ్మిన ఫిర్యాదుదారు రూ.1.20 కోట్లకు ఆస్తిని కొనుగోలు చేసేందుకు అంగీకరించి, చెక్కుల ద్వారా రూ.45.36 లక్షలు, నగదు రూపంలో రూ.30 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. అనంతరం 12-02-2025న సేల్ డీడ్ డాక్యుమెంట్ నంబర్ 4081/25 ద్వారా రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ, స్థలానికి వాస్తవ భౌతిక స్వాధీనం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. కొలన్ రాజమోహన్ రెడ్డి వద్ద సర్వే నంబర్ 15లో వాస్తవంగా 3 గుంటలు అంటే 363 చదరపు గజాల భూమి మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే 2012లో ఆయన తన భార్య కొలన్ హరితకు 237 చదరపు గజాలు, అనంతరం 216 చదరపు గజాల స్థలాలను గిఫ్ట్ డీడ్ల ద్వారా బదలాయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు విస్తీర్ణాలు కలిపి 453 చదరపు గజాలు అవుతాయని తెలిపారు.
ఈ గిఫ్ట్ డీడ్ల ఆధారంగా మొత్తం 600 చదరపు గజాల ఓపెన్ స్థలంలో అపార్ట్మెంట్ నిర్మాణానికి అనుమతులు పొందినట్లు, అనంతరం ఆ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లను పలువురికి విక్రయించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. అదేవిధంగా, ఇదే ఆస్తికి సంబంధించి కొలన్ రాజమోహన్ రెడ్డి సోదరుడు కొలన్ మాణిక్య రెడ్డి తెలంగాణ హైకోర్టులో W.P.No.34567/2024 దాఖలు చేసిన విషయాన్ని కూడా తమకు దాచిపెట్టారని ఫిర్యాదుదారు ఆరోపించారు. భవన నిర్మాణ అనుమతిని రద్దు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైనట్లు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న భూమి విస్తీర్ణానికి మించి గిఫ్ట్ డీడ్లు సృష్టించి, వాస్తవంగా తమకు లేని భూమిని విక్రయించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. తప్పుడు వివరాలతో సేల్ డీడ్ రూపొందించి తమను మోసం చేశారని, విషయం గురించి ప్రశ్నించగా దంపతులు దుర్భాషలాడుతూ బెదిరించారని కూడా పేర్కొన్నారు. దీనిపై కొలన్ హరిత, కొలన్ రాజమోహన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ మోసపూరిత ఘటన ప్రస్తుతం నిజాంపేట్ లో చర్చనీయాంశంగా మారింది.