PRABANJANAM
Date of Publish : 03 September 2026, 11:53 am Posted by : Prabanjanam News

ED Raids On Neetu Bhai: గంజాయి డాన్‌ ‘నీతూ బాయి’ ఆస్తులపై ఈడీ సోదాలు..డ్రగ్స్ రాకెట్ నిర్వహణపై ఆరా

సిటీ క్రైమ్ (ప్రభంజనం):  డ్రగ్స్‌ కేసులకు సంబంధించిన మనీలాండరింగ్‌ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. గంజాయి రాకెట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీతూ బాయికి సంబంధించిన ఇళ్లు ఇతర ప్రదేశాల్లో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. తెలంగాణ ఎలైట్‌ యాక్షన్‌ గ్రూప్‌ ఫర్‌ డ్రగ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (Eagle Team) నమోదు చేసిన డ్రగ్స్‌ కేసుల ఆధారంగా ఈ మనీలాండరింగ్‌ దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. నషా ముక్త్‌ భారత్‌ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల కేసుల్లో ఎన్‌ఫోర్స్మెంట్‌ చర్యలు చేపడుతున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ దర్యాప్తులో ఈడీ ప్రధానంగా నీతూ బాయిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సైబరాబాద్‌ నార్కోటిక్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈగల్ నమోదు చేసిన పలు ఎఫ్‌ఐఆర్‌లలో ఆమె పరారీలో ఉన్న నిందితురాలిగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈగల్ టీం నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ ఈడీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. గంజాయి విక్రయాల ద్వారా వచ్చినట్లు ఆరోపిస్తున్న అక్రమ ఆదాయం, ఆ డబ్బును ఎలా నిర్వహించారు, ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి అనే అంశాలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది.