PRABANJANAM
Date of Publish : 04 August 2026, 8:40 pm Posted by : Prabanjanam News

హరీశ్‌రావుపై తప్పుడు ప్రచారం..ఓయూ పీఎస్‌లో బీఆర్ఎస్‌వీ ఫిర్యాదు

  • ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకోం
  • కాంగ్రెస్‌ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్‌రెడ్డిపై బీఆర్ఎస్‌వీ ఆగ్రహం
  • బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్

ఉస్మానియా యూనివర్సిటీ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీశ్‌రావుపై కాంగ్రెస్‌ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ భారత్‌ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (BRSV) మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేని పేరు సంపాదించుకున్న హరీశ్‌రావు ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్‌ నాయకులు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్‌రెడ్డి నిరాధార ఆరోపణలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్‌వీ నాయకులు ఆరోపించారు. పవిత్రమైన ఆలయ దర్శనాలకు సంబంధించిన అంశాలను సైతం వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.కాంగ్రెస్‌ నేతలు వెంటనే ఎలాంటి ఆధారాలు లేని తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, అదే మీడియా వేదికల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్‌వీ నాయకులు డిమాండ్ చేశారు. సోషల్ మీడియా, వెబ్‌సైట్లు, ఇతర డిజిటల్ మాధ్యమాల్లో ఉన్న సంబంధిత పోస్టులు, వీడియోలను తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా క్షమాపణ చెప్పకపోతే మరియు వీడియోలను తొలగించకపోతే సివిల్, క్రిమినల్ పరువు నష్టం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్యతో పాటు నాయకులు చాటారి దశరథ్, కాటం శివ, బొల్లు నాగరాజు యాదవ్, కొంపల్లి నరేష్, మిథున్ ప్రసాద్, శ్రీకాంత్, నాగేందర్ రావు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.