- ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం
- యువతికి తీవ్ర గాయాలు
ఘట్కేసర్, (ప్రభంజనం):
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యంనంపేట ఫ్లైఓవర్‌పై శనివారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువతి తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా తిప్పారెడ్డిపల్లికి చెందిన బద్దుల కిషోర్ (19) అనే విద్యార్థి ప్రస్తుతం బీ.ఎన్.రెడ్డి నగర్‌లో నివాసముంటూ ఇబ్రహీంపట్నంలోని సెయింట్ మార్టిన్స్/సెయింట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఉదయం తన బంధువైన విజయ అనే యువతిని యంనంపేటలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష రాయించేందుకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా, ఫ్లైఓవర్‌పై ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిషోర్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన విజయను వెంటనే మేడిపల్లిలోని శ్రీకర ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.