PRABANJANAM
Date of Publish : 19 August 2026, 6:21 pm Posted by : Prabanjanam News

జానీ మాస్టర్‌ కు డ్యాన్సర్స్ యూనియన్‌కు ఫెడరేషన్ షాక్

  • యూనియన్ లో నిషేధం కొనసాగింపు..

సినిమా డెస్క్ (ప్రభంజనం): ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య (ఫిల్మ్ ఫెడరేషన్) మరోసారి షాక్ ఇచ్చింది. ఆయనపై గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగించాలని ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ నిర్ణయించింది. బుధవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించినందుకే జానీ మాస్టర్‌పై విధించిన చర్యలను కొనసాగిస్తున్నట్లు సమాఖ్య స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆయన గతంలో ఫెడరేషన్‌కు అందజేసిన రూ.3 లక్షల మొత్తాన్ని కూడా తిరిగి ఆయనకే పంపించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.

మరోవైపు డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుమలత వ్యవహారశైలిపై ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సినీ పెద్దలు, నిర్మాతల మండలి సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఏకపక్షంగా ఉప ఎన్నికలు నిర్వహించడాన్ని సమాఖ్య తప్పుపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇకపై డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫెడరేషన్ తరఫున ఎలాంటి సహకారం అందించబోమని స్పష్టం చేసింది. అయితే, అసోసియేషన్‌తో సంబంధం లేకుండా సామాన్య డ్యాన్సర్లకు వ్యక్తిగతంగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. మిగతా 23 క్రాఫ్టులకు మాత్రం ఫెడరేషన్ నుంచి యథావిధిగా సహకారం కొనసాగుతుందని జనరల్ కౌన్సిల్ స్పష్టం చేసింది. తాజా నిర్ణయాలతో జానీ మాస్టర్ వ్యవహారం, డ్యాన్సర్స్ యూనియన్‌కు సంబంధించిన వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.