PRABANJANAM
Date of Publish : 31 October 2026, 11:45 am Posted by : Prabanjanam News

గర్ల్స్ హాస్టల్ ముసుగులో గలీజ్ దందా..

  • హైదరాబాద్‌లో గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల సేకరణ..!
  • బేగంపేటలో అర్ధరాత్రి పోలీసుల మెరుపు దాడులు..
  • ఆయా రాష్ట్రాలకు చెందిన 10 మంది యువతుల గుర్తింపు
  • అండాల సేకరణ రాకెట్ వివరాలు సేకరిస్తున్న పోలీసులు

సిటీ క్రైమ్, ( ప్రభంజనం )

హైదరాబాద్ నగరంలో మరో గలీజ్ దందా వెలుగులోకి వచ్చింది. నగరంలోని బేగంపేటలో గర్ల్స్ హాస్టల్ ముసుగులో అక్రమంగా అండాల సేకరణ, విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న నజ్రాన్‌ అపార్ట్మెంట్‌లో నిర్వహిస్తున్న అమీ నీతా గర్ల్స్ హాస్టల్‌ పై పోలీసులు అర్ధరాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. బేగంపేట పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్‌ (ఎస్‌ఓటీ) సంయుక్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో పలు అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రాథమిక విచారణ ప్రకారం.. గత ఏడాది కాలంగా ఈ హాస్టల్‌ కేంద్రంగా అమ్మాయిల నుండి అండాల సేకరణ కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన 10 మంది యువతులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారంతో హాస్టల్ పై దాడులు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఓ మహిళ కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యువతుల నుంచి అండాలను సేకరించి, సమీపంలోని సంతాన సాఫల్య కేంద్రాలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. అండాల సేకరణ వెనుక ఎవరున్నారు? వాటిని ఏయే ఫెర్టిలిటీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు? ఈ వ్యవహారంలో మధ్యవర్తుల పాత్ర ఎంత? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. అండాల సేకరణతో పాటు కొందరు పురుషుల నుంచి వీర్య నమూనాలు కూడా సేకరించి సరఫరా చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్‌ ముసుగులో ఇతర అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు కూడా విచారణలో భాగంగా పరిశీలనకు వచ్చినట్లు సమాచారం.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువతులు స్వచ్ఛందంగా హాస్టల్‌లో చేరారా? అండాల సేకరణకు సంబంధించిన వ్యవహారం గురించి వారికి ముందుగానే తెలుసా? లేక ఉద్యోగం, ఇతర అవకాశాల పేరుతో మధ్యవర్తులు వారిని ఇక్కడికి తీసుకొచ్చారా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అండాల సేకరణకు యువతులు సమ్మతి తెలిపారా? వైద్యపరమైన నిబంధనలు, చట్టపరమైన అనుమతులు పాటించారా? అనే అంశాలు కూడా కీలకంగా మారాయి.
మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతి ఆదేశాల మేరకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా? ఏయే వైద్య కేంద్రాలకు సంబంధాలు ఉన్నాయి? అన్న వివరాలను సేకరిస్తున్నారు. పోలీసుల పూర్తి విచారణ అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.