హైదరాబాద్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌యూసీ) క్యాంపస్ కేంద్రంగా సాగుతున్న గంజాయి దందాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కొంతకాలంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు, ‘ఈగల్ టీమ్’ సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం హెచ్‌యూసీ క్యాంపస్‌లోనే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ సియాంగ్ జిల్లా లైకాబలి అప్పర్ కాలనీకి చెందిన భిస్వజిత్ కలితా అలియాస్ బిస్వా (28) ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో నివసిస్తున్నాడు. యాక్టర్ ట్రైనర్‌గా పనిచేస్తున్న ఇతను, హెచ్‌యూసీకి చెందిన పూర్వ విద్యార్థి (అలమ్నస్) కావడం గమనార్హం.
కేసు నేపథ్యం ఇదీ..
ఆగస్టు 7న హెచ్‌యూసీలోని మెన్‌స్-L హాస్టల్‌లో విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన ఓ విద్యార్థిని విచారించగా అసలు గుట్టు రట్టయింది. తాను 10 గ్రాముల ఎండు గంజాయిని రూ.500 వెచ్చించి తన స్నేహితుడైన భిస్వజిత్ కలితా వద్ద కొనుగోలు చేసినట్లు ఆ విద్యార్థి పోలీసుల ఎదుట అంగీకరించాడు.
ఈ మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ సెక్షన్ 27 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న భిస్వజిత్ కదలికలపై నిఘా పెట్టిన గచ్చిబౌలి పోలీసులు, ఈగల్ టీమ్‌తో కలిసి అతడిని హెచ్‌యూసీ క్యాంపస్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, తదుపరి చట్టపరమైన చర్యలు నిమిత్తం రిమాండ్‌కు తరలించారు. విద్యాసంస్థల క్యాంపస్‌లలో మత్తు పదార్థాల సరఫరాకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.