- పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి వేడుకలు
యాదగిరిగుట్ట : (ప్రభంజనం)
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయ అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, వేద పండితులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, కలశ స్థాపన తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఈఓ భవాని శంకర్ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందారు.