PRABANJANAM
Date of Publish : 06 August 2026, 11:22 am Posted by : Prabanjanam News

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీ డేట్ ఫిక్స్

  • ఆరోజు నుంచే కొత్త రేషన్ కార్డుల జారీ డేట్ ఫిక్స్ చేసిన సీఎం
  • రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణ బ్యూరో, ( ప్రభంజనం ):  అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్తగా మంజూరైన లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ ( పీడీఎస్) రేషన్ కార్డులను ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమో జారీ చేశారు. ఈ విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన ఒక ప్రకటనలో రేషన్ కార్డుల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోందని తెలిపారు. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు.  సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో ప్రారంభోత్సవం నిర్వహించనుండగా, అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ అధికారిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. లబ్ధిదారుల జాబితాల ఖరారు నుంచి కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలు, మీడియా ప్రచారం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.  పేద కుటుంబాల ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తూ, ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పాలనలో ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు.