PRABANJANAM
Date of Publish : 15 August 2026, 9:24 am Posted by : Prabanjanam News

నిరుద్యోగులకు శుభవార్త .. కానిస్టేబుల్ 34, ఎస్సై 37 ఏళ్లు ఏజ్ లిమిట్ పెంపు

  • యూనిఫాం ఉద్యోగాల వయోపరిమితి మరో రెండేళ్లు పెంపు
  • పోలీస్, ఫైర్, ఎక్సైజ్ ఉద్యోగాల అభ్యర్థులకు శుభవార్త

తెలంగాణ బ్యూరో, ప్రభంజనం: తెలంగాణలో యూనిఫాం సర్వీసుల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. పోలీస్‌, ఫైర్‌, జైళ్లు, ఎస్పీఎఫ్‌, ఎక్సైజ్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఫారెస్ట్‌ తదితర శాఖల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతంలో ఇచ్చిన ఐదేళ్ల వయోసడలింపుతో కలిపి మొత్తం మినహాయింపు ఏడేళ్లకు చేరింది. ఇప్పటికే ఐదేళ్ల వయోపరిమితి పెంపు 2026 మే 18 నుంచి అమల్లో ఉంది. తాజాగా మరో రెండేళ్లు పెంచడంతో యూనిఫాం సర్వీసుల్లో ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్లకు కూడా ఈ తాజా నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లకు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) పోస్టులకు 37 ఏళ్లకు చేరనుంది. దీంతో గతంలో వయోపరిమితి కారణంగా పోలీస్‌ ఉద్యోగాలకు దూరమైన పలువురు అభ్యర్థులకు మరోసారి అవకాశం లభించనుంది. యూనిఫాం సర్వీసుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం వయోసడలింపు కోరుతూ నిరుద్యోగ యువత నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలించింది. వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తాజా జీవోతో పోలీస్‌, ఫైర్‌, జైళ్లు, ఎస్పీఎఫ్‌, ఎక్సైజ్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఫారెస్ట్‌ శాఖల్లో ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అదనపు అవకాశం దక్కనుంది. ముఖ్యంగా పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న వారికి ఈ నిర్ణయం ప్రయోజనకరంగా మారనుంది.