PRABANJANAM
Date of Publish : 30 August 2026, 9:10 pm Posted by : Prabanjanam News

తన ఇంటి నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు..

  • డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ వృద్ధుడి ఆరోపణ

కూకట్‌పల్లి: ( ప్రభంజనం )

తన సొంత ప్లాట్‌లో ఇంటి నిర్మాణం చేపడుతున్న తనను సొసైటీ కార్యదర్శి, ఆమె భర్త డబ్బుల కోసం వేధిస్తూ తప్పుడు ఆరోపణలతో నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారని భగత్‌సింగ్ నగర్ ఫేజ్-2, ప్లాట్ నంబర్ 1024 యజమాని ఎం.డి. జక్రియ ఆరోపించారు. ఆదివారం భగత్‌సింగ్ నగర్ కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు 85 ఏళ్లు నిండాయని, ఈ వయస్సులో సొంతింటి నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉన్నప్పటికీ, ఐడీపీఎల్ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి సిరిపురం నాగమణి, ఆమె భర్త మధు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని జక్రియ తెలిపారు. నిర్మాణం కొనసాగించాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని, లేదంటే పనులు అడ్డుకుంటానని మధు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. 1995లో భగత్‌సింగ్ నగర్ సొసైటీ ఫేజ్-2లోని ప్లాట్ నంబర్ 1024లో 470 గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు జక్రియ తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో టైపింగ్ పొరపాటు వల్ల విస్తీర్ణం 322 గజాలుగా నమోదైందని, అనంతరం సొసైటీని సంప్రదించి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రెక్టిఫికేషన్ చేయించుకున్నట్లు చెప్పారు. సంబంధిత పత్రాలు, ఎన్‌ఆర్‌ఎస్ తదితర రికార్డులు తన వద్ద సక్రమంగా ఉన్నాయని పేర్కొన్నారు. 2023లో జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు తీసుకుని ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించినట్లు జక్రియ చెప్పారు. వయోభారం కారణంగా నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించలేక బిల్డర్ ద్వారా పనులు చేపట్టినప్పటి నుంచి మధు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. మధుకు సొసైటీలో ఎలాంటి అధికారిక పదవి లేదా సంబంధం లేకపోయినా, తన భార్య సొసైటీ కార్యదర్శిగా ఉన్న విషయాన్ని అడ్డుపెట్టుకుని తనపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. తనను వేధించడంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కూకట్‌పల్లి సీనియర్ సివిల్ కోర్టును ఆశ్రయించి నిర్మాణంలో జోక్యం చేసుకోరాదనే ఆదేశాలు పొందినట్లు జక్రియ తెలిపారు.
కాలనీలో ఎవరైనా నిర్మాణాలు చేపడితే సొసైటీ లెటర్‌ప్యాడ్‌పై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేయడం, సమస్య పరిష్కరించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇదే తరహాలో తనను కూడా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తన ప్లాట్ పక్కన ఎలాంటి ఖాళీ స్థలం లేదని, లేఅవుట్ ప్రకారం ప్లాట్ విస్తీర్ణం 470 గజాలేనని జక్రియ స్పష్టం చేశారు. పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని తాను ఆక్రమించుకున్నానంటూ మధు, నాగమణి ఆరోపిస్తూ తనను రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్లాట్ కొనుగోలు చేసిన అనంతరం అక్కడ రేకుల గదులు నిర్మించుకుని ఉన్నానని, తాను ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని, తన వద్ద అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని పేర్కొన్నారు. తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మధు, నాగమణిలపై కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జక్రియ తెలిపారు. పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 85 ఏళ్ల వయస్సులో తనను మానసికంగా వేధిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, వృద్ధాప్యంలో సొంతింటి కలను నెరవేర్చుకుంటున్న తనకు ఇబ్బందులు లేకుండా సహకరించాలని జక్రియ విజ్ఞప్తి చేశారు.