PRABANJANAM
Date of Publish : 01 September 2026, 5:24 pm Posted by : Prabanjanam News

కంటోన్మెంట్‌లో హై అలర్ట్.. బొల్లారంలో ఆయుధాలు మిస్సింగ్‌

సికింద్రాబాద్‌ (ప్రభంజనం):సికింద్రాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ యూనిట్‌కు చెందిన ఆయుధ విభాగంలో కొన్ని ఆయుధాలు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో ఆర్మీ అధికారులు అప్రమత్తమై, కంటోన్మెంట్‌ పరిధిలో హై అలర్ట్‌ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయుధాల విభాగంలో నాలుగు ఏకే-47 తుపాకులు సహా 12కు పైగా ఆయుధాలు మిస్సింగ్‌ అయినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.

ఆయుధాలను భద్రపరిచిన స్టోరేజ్‌ బ్యారక్‌ తలుపులు పగులగొట్టి ఈ చోరీకి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై ఆర్మీ అధికారులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆయుధాలను అపహరించిన వ్యక్తుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

మరోవైపు కంటోన్మెంట్‌ పరిధిలోని ఆర్మీ అధికారుల క్వార్టర్లతో పాటు రాకపోకలపై నిఘా వర్గాలు తీవ్రతరం చేశాయి. క్వార్టర్స్‌లోకి వచ్చిపోయే ప్రతి ఒక్కరినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆర్మీ అధికారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎస్కార్ట్‌ను కూడా పెంచినట్లు తెలిసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్మీ స్టోరేజ్‌లోనే ఈ ఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందిదర్యాప్తు పూర్తయితేనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.