- భర్తను రోకలిబండతో కొట్టి హత్య చేసిన భార్య
హుస్నాబాద్: ( ప్రభంజనం )
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. హనుమాన్ నగర్‌లో వెంకటేశం అనే వ్యక్తిని అతని భార్య రాజమణి రోకలిబండతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
వెంకటేశం ఆసిఫాబాద్‌లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య రాజమణి ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. ఈ నెలలో వెంకటేశం పదవీ విరమణ చేయాల్సి ఉండటంతో రిటైర్మెంట్ అనంతరం వచ్చే డబ్బులు, ఆస్తి విషయంలో దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో అది తీవ్రరూపం దాల్చింది. ఆగ్రహానికి గురైన రాజమణి రోకలిబండతో వెంకటేశంపై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. రాజమణిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.