- ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం
- ముందస్తు బంధనాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరు
- సర్కార్ తీరుపై విరుచుకుపడ్డ బీఆర్‌ఎస్ నేత సీజీఆర్
జిన్నారం: ( ప్రభంజనం )
అక్రమ అరెస్టులతో తనను ఆపలేరని, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఉమ్మడి మండలాల్లోని సుదీర్ఘ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రకటన విడుదల చేసిన తనను, పోలీసులు అకారణంగా ముందస్తు అరెస్టు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని సీజీఆర్ అన్నారు. నాయకులను అక్రమంగా నిర్బంధించినంత మాత్రాన ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడం సాధ్యం కాదని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కక్షసాధింపు రాజకీయాలు పక్కనపెట్టి, ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.