PRABANJANAM
Date of Publish : 10 August 2026, 3:35 pm Posted by : Prabanjanam News

వివేకానందనగర్‌లో పచ్చదనంపై కత్తికట్టిన అక్రమార్కులు!

  • అనుమతి లేని షెడ్డు కోసం ఏపుగా పెరిగిన చెట్టు తొలగింపు
  • స్థానికులు, ప్రకృతి ప్రేమికుల తీవ్ర ఆగ్రహం
  • నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై విమర్శలు

కూకట్ పల్లి(ప్రభంజనం): పచ్చదనానికి మారుపేరుగా నిలవాల్సిన ఓ ప్రశాంత కాలనీలో వ్యాపార కాంక్ష పచ్చని చెట్లను బలి తీసుకుంటోంది. ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ‘హరితహారం’, ‘వనమహోత్సవం’ పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుంటే.. కొందరు అక్రమార్కులు మాత్రం తమ వ్యాపార లాభాల కోసం నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. కనీస అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాల కోసం ఏపుగా పెరిగిన వృక్షాలను కూకటివేళ్లతో తొలగిస్తున్న వైనం వివేకానందనగర్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఏరువాక టిఫిన్ సెంటర్ సమీపంలో ఘటన

వివేకానందనగర్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఏరువాక టిఫిన్ సెంటర్ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా నూతనంగా ఓ షెడ్డును ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఈ షెడ్డుకు వచ్చే కస్టమర్ల వాహనాల పార్కింగ్ కోసం.. దారినపోయే బాటసారులకు, స్థానికులకు ఎంతోకాలంగా నీడనిస్తున్న ఒక పెద్ద చెట్టును నిర్వాహకులు అర్ధాంతంగా తొలగించారు.

పండుగ రద్దీని ఆసరా చేసుకొని దుశ్చర్య

నగరంలో బోనాల పండుగ శోభ సంతరించుకుని, అందరూ పండుగ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న సమయాన్ని అక్రమార్కులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఎవరి కంట పడకుండా, పండుగ హడావుడిలో ఉండగా గుట్టుచప్పుడు కాకుండా ఏళ్ల తరబడి పెరుగుతున్న మహావృక్షాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు.

అధికారుల మౌనంపై విమర్శలు

ప్రధాన రహదారిని ఆనుకుని, ఎలాంటి పార్కింగ్ సౌకర్యం కూడా చూపకుండా చేపడుతున్న ఈ అక్రమ నిర్మాణానికి స్థానిక అధికారులు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆక్రమిస్తూ, పచ్చదనాన్ని నాశనం చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

భగ్గుమంటున్న ప్రకృతి ప్రేమికులు

ఎండనకా వాననకా బాటసారులకు సేదదీర్చి, కాలనీకి అందాన్ని తెచ్చిన చెట్టు నేడు నేలకూలడంతో ప్రకృతి ప్రేమికులు, స్థానిక ప్రజలు తీవ్ర అసహనం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, అనుమతులు లేకుండా పచ్చదనాన్ని హరిస్తున్న అక్రమ షెడ్డు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన అధికారుల తీరుపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.