- రెండో పాటను ఆవిష్కరించిన యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి
హబ్సిగూడ, ( ప్రభంజనం):
విద్యార్థులు, చిన్నారులు చూడదగ్గ సందేశాత్మక చిత్రంగా ‘జయంత్ అండ్ జింగో పెన్’ నిలుస్తుందని యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం (యూఎస్పీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి అన్నారు. చిలుకానగర్‌లోని యూఎస్పీఎఫ్ కార్యాలయంలో చిత్రంలోని రెండో పాటను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో విద్యార్థులు, చిన్నారులకు అనువైన చిత్రాలు రావడం లేదని, చాలా సినిమాల్లో హింసాత్మక సన్నివేశాలే అధికంగా ఉంటున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు నవీన్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. చిత్రంలోని సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయని, పిల్లలు తప్పక చూడాలని సూచించారు. కార్యక్రమంలో చిత్ర రచయిత్రి, నిర్మాత ప్రవీణ్, దర్శకుడు నవీన్, యూఎస్పీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తిమోతి, కార్యదర్శి పి. వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజు తదితరులు పాల్గొన్నారు.