PRABANJANAM
Date of Publish : 25 August 2026, 11:56 am Posted by : Prabanjanam News

Kaleshwaram Project: కాళేశ్వరంపై దుష్ప్రచారానికి ఆధారాలే చెంపపెట్టు: హరీశ్‌రావు

  • రిపోర్టుల సాక్షిగా కాళేశ్వరం.. కాంగ్రెస్‌ ప్రచారంపై హరీశ్‌రావు ఫైర్
  • ఎన్డీఎస్ఏ అఫిడవిట్, సీడబ్ల్యూసీ పీఆర్ఎస్ రిపోర్టులు చెంపపెట్టు
  • అన్నారం, సుందిళ్ళ మోటార్లు ఆన్ చేసి నీళ్ళు లిఫ్ట్ చేయాలని డిమాండ్

హైదరాబాద్ బ్యూరో (ప్రభంజనం): కాళేశ్వరం మొత్తం కుప్పకూలింది.. ప్రాజెక్టు పనికిరాదు.. నీళ్లు ఎత్తలేమంటూ ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌ చేసిన ప్రచారం ఒక్కొక్కటిగా పటాపంచలవుతోంది. అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్‌ చేసుకోవచ్చని స్వయంగా ఎన్డీఎస్ అఫిడవిట్‌లో స్పష్టం చేసిందని, మరోవైపు సీడబ్ల్యూపీఆర్ఎస్ పరిశీలనలో అన్నారం, సుందిళ్లలో ఏ బ్లాక్‌లోనూ నిర్మాణపరమైన సమస్య లేదని, కాంక్రీట్‌ నాణ్యత కూడా బాగుందని వెల్లడైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించి మంగళవారం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇన్నాళ్లు రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి, తెలంగాణకు వచ్చిన గోదావరి నీటిని వినియోగించుకోకుండా కిందికి వదిలేయడం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ క్రిమినల్‌ నెగ్లిజెన్స్‌కు నిదర్శనం అన్నారు. ప్రాజెక్టును నిందిస్తూ నీటిని లిఫ్ట్‌ చేయకుండా ఏపీకి వదిలిపెట్టడం ద్వారా తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం చేశారని, మేము నిలదీసిన తర్వాతే ఆలస్యంగా దేవాదుల, నంది పంపులు ఆన్‌ చేశారని పేర్కొన్నారు. అప్పటికే వరద నీరంతా కిందికి వెళ్లిపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఆలస్యంగా పంపులు ఆన్‌ చేసి.. ఆ తర్వాత వెంటనే ఆఫ్‌ చేశారన్నారు.

ఏపీకి నీళ్లు వదిలారు.. తెలంగాణ రైతులకు కన్నీళ్లు మిగిల్చారు.

ఫలితం ఏమిటి? దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలు సగటున 64.16శాతం ఉండగా.. తెలంగాణలో మాత్రం కేవలం 35.6శాతం మాత్రమే ఉందన్నారు. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ జలాశయాల్లో నీటి నిల్వలు సగానికి చేరువలో ఉండటం దారుణమని, ఇవి కేవలం అంకెలు కాదు.. తెలంగాణ రైతాంగానికి రాబోయే నీటి సంక్షోభానికి సంకేతాలు అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నీటి నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ.. నేడు జలాశయాల్లో నీటి నిల్వల విషయంలో బీహార్‌తో పోటీ పడే దుస్థితికి చేరిందని దుయ్యబట్టారు.

ఇది ప్రకృతి వైపరీత్యం కాదన్న హరీశ్ రావు నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం దుయ్యబట్టారు. కేసీఆర్‌ హయాంలో నీటి కొరతను అధిగమించిన తెలంగాణను.. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మళ్లీ నీటి కష్టాల్లోకి నెట్టిందన్నారు.

నిండుగా పారిన గోదావరి, కృష్ణా నీళ్లను కిందకు విడిచిపెట్టి రాష్ట్రానికి చేసిన కాంగ్రెస్ ద్రోహం ఫలితం ఇదని, కమిషన్లు వేయడానికి, విచారణలు చేయడానికి ఉన్న శ్రద్ధ.. కిందికి పోతున్న గోదావరి, కృష్ణా జలాలను ఒడిసిపట్టి రైతులకు అందించడంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. ఎల్‌ నినో ప్రభావం, భవిష్యత్‌ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని విపక్షాలు, ఇంజినీర్లు హెచ్చరిస్తున్నా..

ప్రభుత్వం పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు. ఇది రాజకీయ కక్షలకు సమయం కాదు. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడాల్సిన సమయం అన్నారు. పార్టీలో కుమ్ములాటలు, కొట్లాటలపై శ్రద్ధ పక్కనపెట్టి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి హక్కులు, రైతుల ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. కాళేశ్వరం పై దుష్ప్రచారం మానేసి, అన్నారం, సుందిళ్ల మోటార్లు ఆన్ చేసి గోదావరి నీటిని ఎత్తిపోయాలని, రిజర్వాయర్లు నింపి రైతుల పొలాలకు నీళ్లు అందివ్వాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.