PRABANJANAM
Date of Publish : 17 August 2026, 1:07 pm Posted by : Prabanjanam News

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలనే వెంటనే అమలు చేయాలి

  • శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన

శేరిలింగంపల్లి : ( ప్రభంజనం )

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ ఇంఛార్జ్ మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు స్థానిక నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళనలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డితో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. కాలనీలో ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు, పేద కుటుంబాలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. పథకాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పొట్ట నరేందర్ యాదవ్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, పేద కుటుంబాలకు ఇబ్బందులు కలగకుండా పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పునరుద్ధరించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. పథకాల అమలుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.