PRABANJANAM
Date of Publish : 27 August 2026, 1:20 pm Posted by : Prabanjanam News

ఆఖరి రాఖీ ఇదేనా అన్నయ్యా.. విగతజీవుడైన అన్న శవానికి చెల్లెలు కన్నీటి వీడ్కోలు!

హైదరాబాద్ బ్యూరో:  పండుగ కళతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో ఇప్పుడు గుండెలు పగిలే శోకం తాండవిస్తోంది. తోడబుట్టిన అన్నతో పండగ జరుపుకోవాల్సిన ఆ చెల్లెలి జీవితంలో ఆ దేవుడు తీరని విషాదాన్ని నింపాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని చటాన్‌పల్లికి చెందిన నవీన్ అకస్మాత్తుగా జరిగిన విద్యుత్ షాక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

ఇకపై తనను కంటికి రెప్పలా కాపాడే అన్న లేడనే నిజాన్ని ఆ చెల్లెలు పూజిత జీర్ణించుకోలేకపోతోంది. ప్రాణం పోయి విగతజీవుడిగా పడి ఉన్న అన్న మృతదేహం వద్ద ఆ పసిదిక్కు పడిన వేదన అక్కడి వారందరి హృదయాలను కలచివేసింది. కన్నీటి సంద్రంలో మునిగిపోయిన ఆ చెల్లెలు.. విధిలేని పరిస్థితిలో నిర్జీవంగా ఉన్న అన్న చేతికి రాఖీ కట్టిన దృశ్యం ఎవరినైనా కంటతడి పెట్టించేలా ఉంది.

జీవితాంతం రక్షణగా ఉండాల్సిన అన్న విగతజీవుడిగా మారడంతో, ఆఖరి రాఖీ కట్టి ఆమె చేసిన రోదన ఆ గ్రామస్తులందరినీ కన్నీరుమున్నీరుగా మార్చింది. ఆనందంగా గడపాల్సిన రాఖీ పండుగ పూట ఆ ఇంట జరిగిన ఈ విషాదం చూపరుల హృదయాలను పిండేస్తోంది.