PRABANJANAM
Date of Publish : 22 August 2026, 9:25 am Posted by : Prabanjanam News

టాయిలెట్ కడిగిన మంత్రి జూపల్లి…! ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతపై మంత్రి సీరియస్..

  • తానే స్వయంగా టాయిలెట్ శుభ్రం చేసిన జూపల్లి
  • పెంట్లవెళ్లి తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిపై అసహనం

నాగర్ కర్నూల్ (ప్రభంజనం) :నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన మంత్రి, టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటంపై మండిపడ్డారు. టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై సంబంధిత అధికారులు, సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు నిత్యం సందర్శించే కార్యాలయాల్లో కనీస పారిశుద్ధ్య ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అధికారులను మందలించడంతోనే ఆగకుండా మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా నీటిని ఉపయోగించి అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను శుభ్రం చేశారు. కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, సిబ్బంది తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి ఆదేశించారు. మంత్రి స్వయంగా టాయిలెట్లను శుభ్రం చేయడం అక్కడున్న అధికారులకు, సిబ్బందికి పరిశుభ్రతపై బాధ్యతను గుర్తుచేసినట్లయింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆకస్మిక తనిఖీలో కార్యాలయ నిర్వహణ, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన మంత్రి, లోపాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.