PRABANJANAM
Date of Publish : 14 August 2026, 11:12 am Posted by : Prabanjanam News

ఢిల్లీ విమానాశ్రయంలో కోతి పుర్రె కలకలం

  • హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగులో లభించిన పుర్రె, మంత్రదండం

న్యూఢిల్లీ (ప్రభంజనం):  ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వింత ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ కు వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడి బ్యాగేజీలో జంతువు పుర్రె, మంత్ర దండం వంటి వస్తువులు గుర్తించడం కలకలం రేపింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి.. ఆగస్టు 10న విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బంది సాధారణ భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడి బ్యాగును స్కానింగ్ చేయగా అందులో అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. దీంతో బ్యాగును తెరిచి తనిఖీ చేయగా ఓ పుర్రె, మంత్ర దండం వంటి వస్తువులు బయటపడ్డాయి. దీనిపై అధికారులు ప్రయాణికుడిని ప్రశ్నించగా.. అది కోతి పుర్రె అని అతడు చెప్పినట్లు సమాచారం. వెంటనే అతడి ప్రయాణాన్ని నిలిపివేసిన అధికారులు, తదుపరి విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వన్యప్రాణులు, వాటి శరీర భాగాలు లేదా వాటితో తయారు చేసిన వస్తువులను అక్రమంగా కలిగి ఉండటం, రవాణా చేయడం చట్టపరంగా నేరం.

ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న పుర్రె నిజంగా కోతిదేనా? లేదా మరేదైనా జంతువుదా? అనే విషయాన్ని అధికారులు నిర్ధారించాల్సి ఉంది. అది వన్యప్రాణికి చెందినదిగా తేలితే.. ప్రయాణికుడికి పుర్రె ఎలా లభించింది, దాని మూలం ఏమిటి, దానిని కలిగి ఉండేందుకు అతడికి చట్టపరమైన అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై దర్యాప్తు చేపట్టనున్నారు. అవసరమైతే పుర్రెను గుర్తించేందుకు వన్యప్రాణి నిపుణులు, శాస్త్రవేత్తల సహాయం తీసుకునే అవకాశం ఉంది.