PRABANJANAM
Date of Publish : 14 September 2026, 6:36 pm Posted by : Prabanjanam News

14 ఏళ్లుగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్న నారాయణ పాఠశాల

  • భీంగల్‌లో ఉచితంగా భక్తులకు 500 విగ్రహాలు అందజేత

భీంగల్ : (ప్రభంజనం)

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా భీంగల్‌లోని నారాయణ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆధ్వర్యంలో గత 14 ఏళ్లుగా మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు ప్రసాద్ చేతుల మీదుగా 500 మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు ప్రసాద్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఏటా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు దూరంగా ఉండాలని కోరారు. ఇతర విగ్రహాల వల్ల నీరు కలుషితమై, నీటిలోని చేపలు, పక్షులు మృతి చెందే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను వినియోగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.