PRABANJANAM
Date of Publish : 10 August 2026, 1:40 pm Posted by : Prabanjanam News

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి:కేంద్ర మంత్రి బండి సంజయ్‌

  • హర్‌ ఘర్‌ తిరంగా’ను విజయవంతం చేయండి

హైదరాబాద్‌: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘హర్‌ ఘర్‌ తిరంగా’ అభియాన్‌ను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో బండి సంజయ్‌ జాతీయ జెండాను ఎగురవేశారు.

కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు, విద్యార్థులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తిని చాటుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, కూడలిలో తిరంగా ర్యాలీలు, దేశభక్తి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.ఆగస్టు 12 నుంచి 14 వరకు స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల విగ్రహాలను శుభ్రం చేసి, స్మారక చిహ్నాల వద్ద పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. జాతీయ జెండా దేశ ఐక్యత, సమైక్యత, అఖండతకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగిరేలా చూసి ‘హర్‌ ఘర్‌ తిరంగా’ అభియాన్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.