PRABANJANAM
Date of Publish : 20 August 2026, 6:20 pm Posted by : Prabanjanam News

OU : ఓయూలో విద్యార్థి గర్జన.. సీఐపై తక్షణ చర్యలకు డిమాండ్!

  • మహబూబాబాద్ ఘటనపై జెన్ జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తీవ్ర ఆగ్రహం
  • విద్యార్థిపై దాడి ఘటనపై వెల్లువెత్తిన నిరసన
తార్నాక: మహబూబాబాద్ పాలిటెక్నిక్ విద్యార్థిపై జరిగిన దాడి ఘటనను జెన్ జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ ఫౌండర్ శివాజీ మాట్లాడారు. విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ రఘుపతి రెడ్డిపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని, విచారణ పూర్తయ్యే వరకు ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.తమ సమస్యలపై ప్రశ్నించడం విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కు అని, పోలీసులు సంయమనంతో చట్టబద్ధంగా వ్యవహరించాలని శివాజీ హితవు పలికారు. విద్యార్థులపై దాడులు, బెదిరింపులకు పాల్పడే ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నెల 30న ఓయూలో భారీ విద్యార్థి సభ..

రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఫీజుల నియంత్రణ, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల, ఉపాధి అవకాశాలు, హాస్టల్ సమస్యల పరిష్కారం, స్కాలర్‌షిప్‌ల పంపిణీ వంటి కీలక అంశాలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని శివాజీ స్పష్టం చేశారు. ఈ విద్యార్థి సమస్యలపై ఈ నెల 30న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న భారీ విద్యార్థి సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ నాగునాయక్, ట్రెజరర్ అంజనేయులు, నాయకులు జయలాల్, ప్రకాష్, రాకేష్, సురేష్, అయోధ్య తదితరులు పాల్గొన్నారు.