PRABANJANAM
Date of Publish : 02 September 2026, 12:55 pm Posted by : Prabanjanam News

మద్యానికి ‘నో’.. పెద్ద ఎక్లరా గ్రామసభ సంచలన తీర్మానం

  • మద్యపాన నిషేధానికి పెద్ద ఎక్లరా గ్రామసభ ఏకగ్రీవ తీర్మానం
  • గ్రామస్తులంతా ఏకమై నిర్ణయం..
  • అధికారులకు తీర్మానం పత్రం అందజేత

జుక్కల్ (ప్రభంజనం): మద్యపాన నిషేధానికి పెద్ద ఎక్లరా గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందడుగు వేశారు. మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లరా గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామసభలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ నిర్ణయంతో పెద్ద ఎక్లరా గ్రామం మద్నూర్ మండలంలో ఆదర్శంగా నిలిచింది. గ్రామసభలో పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజల సమక్షంలో మద్యం విక్రయాలు, సరఫరాను పూర్తిగా నిషేధించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహేష్, ఉపసర్పంచ్ సంగ్రామ్ పటేల్ మాట్లాడుతూ.. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామసభ తీర్మానానికి విరుద్ధంగా ఎవరైనా గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయించినా, సరఫరా చేసినా వెంటనే పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని గ్రామసభ నిర్ణయించింది. చట్టాలు, నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకునేలా చూడాలని తీర్మానంలో పేర్కొన్నారు. మద్యం కారణంగా సంతోషంగా ఉండాల్సిన కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, మద్యానికి బానిసైన వారి ఆరోగ్య పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని సర్పంచ్, ఉపసర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిర్మూలించి ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కాగా, బుధవారం స్థానిక ఎక్సైజ్ ఎస్సై నాగేష్ గౌడ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి, మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డికి గ్రామసభ తీర్మానం పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేష్, ఉపసర్పంచ్ సంగ్రామ్ పటేల్, అభిషేక్ పటేల్, బాబు గొండ తదితరులు పాల్గొన్నారు.